Central Government: బంగారం నిల్వదారులకు కేంద్రం షాక్ 4 d ago

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(GMS)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. గృహాలు, సంస్థలు తమ ఉత్పాదక ప్రయోజనాల కోసం బంగారాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు 2015 సెప్టెంబరు 15న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. మూడు విభాగాలు స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలికంగా ఉన్న ఈ పథకం అమలులో.. పనితీరు, వేగంగా మారుతున్న మార్కెట్ల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్ పథకాలను కేంద్ర ఆర్థికశాఖ నిలిపివేసింది. బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈ పథకం కింద దాదాపు 31వేల కిలోల బంగారాన్ని సమీకరించింది. స్వల్పకాలిక బంగారం డిపాజిట్ పథకాలను (ఏడాది నుంచి మూడేళ్లు) మాత్రం బ్యాంకులు కొనసాగించవచ్చని ఆర్థికశాఖ పేర్కొంది. బ్యాంకులు అందించే స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్‌లను ఆయా సంస్థల ఆర్థికస్థితి, నిర్ణయాలకు అనుగుణంగా కొనసాగించవచ్చు. అంతేకాకుండా ఇప్పటివరకు చేసిన డిపాజిట్లు కూడా కొనసాగుతాయి.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(GMS) ఎందుకు..?
దీర్ఘకాలంలో విదేశాల నుంచి భారత్ చేసుకునే బంగారం దిగుమతులను తగ్గించాలన్న ఉద్దేశంతో సెప్టెంబర్ 15, 2015న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(పసిడి నగదీకరణ పథకం)ను ప్రభుత్వం తీసుకువచ్చింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మూడు విధాలుగా ఉంటుంది.
1. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (1-3 సంవత్సరాలు).
2.మిడ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (5-7 సంవత్సరాలు).
3. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (12-15 సంవత్సరాలు).
ఉపయోగం ఏంటీ..!
గృహాల్లో అధికంగా నిల్వ ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం ముగిసిన తర్వాత అదే బంగారాన్ని లేదా దానికి సమానమైన నగదును పొందే సదుపాయం ఉంది. ఈ పథకం కింద నవంబర్ 2024 వరకు 31,164 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేయడం జరిగింది. స్వల్పకాలిక
పథకం కింద 7,509 కిలోలు, మధ్యస్థ పథకం కింద 9,728 కిలోలు, దీర్ఘకాలిక పథకం కింద 13,926 కిలోల బంగారం సమకూరింది. ఈ పథకంలో 5693 మంది డిపాజిటర్లు ఉన్నారు.